You are currently viewing The Lion and the Mouse

The Lion and the Mouse

సింహం – ఎలుక

అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవికి రాజు ఒక పెద్ద సింహం.

ఒకరోజు మధ్యాహ్నం ఆ సింహం ఒక చెట్టు కింద హాయిగా నిద్రపోతోంది. అప్పుడు అక్కడికి ఒక చిన్న ఎలుక వచ్చింది. ఆ ఎలుకకు ఆడుకోవాలనిపించి, నిద్రపోతున్న సింహం మీదకు ఎక్కి అటూ ఇటూ గెంతడం మొదలుపెట్టింది.

సింహానికి వెంటనే మెలకువ వచ్చేసింది. తన నిద్ర పాడుచేసినందుకు దానికి చాలా కోపం వచ్చింది. వెంటనే తన పెద్ద పంజాను ఎత్తి ఆ చిన్న ఎలుకను గట్టిగా పట్టుకుంది.

ఎలుక భయంతో వణికిపోతూ, “మహారాజా! దయచేసి నన్ను క్షమించండి. నన్ను తినకండి, వదిలేయండి. ఎప్పుడైనా మీకు ఆపద వస్తే నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను” అని బతిమాలింది.

అది విన్న సింహం బిగ్గరగా నవ్వింది. “ఇంత చిన్న ఎలుకవు, నాకేం సహాయం చేస్తావులే” అనుకుని, జాలి పడి ఎలుకను వదిలేసింది. ఎలుక సంతోషంగా అక్కడి నుంచి పారిపోయింది.

కొన్ని రోజుల తర్వాత…

అడవికి ఒక వేటగాడు వచ్చాడు. వాడు వేసిన పెద్ద వలలో ఆ సింహం చిక్కుకుపోయింది. వల నుంచి బయటకు రాలేక సింహం “రోర్… రోర్…” అని గట్టిగా అరిచింది.

ఆ అరుపులు విన్న ఎలుక పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది. వలలో ఉన్న సింహాన్ని చూసి, “మహారాజా భయపడకండి, నేను వచ్చాను!” అని చెప్పింది. వెంటనే తన పదునైన చిన్న పళ్లతో వలను గబగబా కొరికేసింది.

వల తెగిపోవడంతో సింహం సంతోషంగా బయటకు వచ్చింది. సింహం ఎలుకకు “థాంక్యూ” చెప్పింది. అప్పటి నుండి సింహం, ఎలుక ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు.

కథలోని నీతి:

  • ఎవరినీ వాళ్ల ఆకారం చూసి తక్కువగా అంచనా వేయకూడదు.
  • మనం ఇతరులకు మేలు చేస్తే, మనకు కూడా మంచే జరుగుతుంది

Leave a Reply